శనివారం, 14 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2023 (12:07 IST)

నిరంతరం నా శ్రేయస్సును కోరుకునే మా అన్న సీఎం అవుతుండు... బండ్ల గణేశ్

bandla ganesh
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు రేవంత్ రెడ్డికి సినీ నిర్మాత బండ్ల గణేశ్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులైన మా నాయకుడు, నిరంతరం నా శ్రేయస్సును కోరుకునే మా అన్న అనుమల రేవంత్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు. నాడు బూర్గుల, నేడు అనుమల పాలమూరు నుంచి ముఖ్యమంత్రులు అంటూ మరో ట్వీట్ చేశారు. 
 
కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రేవంత్ రెడ్డి పాలనలో అందరినీ కలుపుకుని పోయి, ప్రగతిశీల, పారదర్శక పాలన అందిస్తారని నాకు నమ్మకం ఉందంటూ సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. దీనికి బండ్ల గణేశ్ రీట్వీట్ చేశారు. 
 
హస్తినలో రేవంత్ బిజిబిజీ... ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో మార్పు  
 
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి, సీఎల్పీ నేత రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌తో ఆయన భేటీ అయ్యారు. సీఎల్పీ నేతగా తనను ప్రకటించిన నేపథ్యంలో వారిద్దరికీ రేవంత్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత నంబర్ టెన్ జన్‌పథ్‌కు వెళ్లి కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. ప్రమాణస్వీకారానికి వారిని ఆహ్వానించనున్నారు. అలాగే, రాష్ట్రంలో మంత్రివర్గ ఏర్పాటు, ఇతర అంశాలపై సోనియా, రాహుల్‌తో రేవంత్‌ చర్చించనున్నారు. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకార సమయంలో మార్పు జరిగింది. గురువారం ఉదయం 10.28 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని తొలుత నిర్ణయించగా.. తాజాగా ఆ సమయాన్ని కాస్త వెనక్కి జరిపారు. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇతర శాఖల ఉన్నతాధికారులు పరిశీలించారు. చేస్తున్న ఏర్పాట్లు, బందోబస్తు తదితర అంశాలపై డీజీపీ, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులను సీఎస్‌ అడిగి తెలుసుకున్నారు. 
 
మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ, ఏర్పాట్లపై ఎల్బీ స్టేడియంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ నేతలతో పోలీసు, సాధారణ పరిపాలన శాఖ అధికారులు చర్చించారు. సీఎల్పీ నేతగా ఎంపికైన రేవంత్‌ రెడ్డి గురువారం రాష్ట్ర నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.