సీఎం కేసీఆర్‌కు తేరుకోలేని షాకిచ్చిన కోనేరు కోనప్ప... రేపు కాంగ్రెస్‌లో చేరిక
భారత రాష్ట్ర సమితికి చెందిన కీలక నేత, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే, అసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు కొనేరు కోనప్ప షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. భారాసకు, జిల్లా అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. పైగా, గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మంత్రి సీతక్క సమక్షంలో ఆయ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. కోనప్పతో పాటు ఆయన కుమారుడు, పార్టీ జెడ్పీ ఇన్‌చార్జి చైర్మన్, కోనేరు కృష్ణారావు కూడా బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పినట్టు సమాచారం. కోనప్ప అనుచరులు పెద్ద సంఖ్యలో పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కోనప్ప జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించడం గమనార్హం. ఇటీవల కోనప్ప తన సోదరుడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అప్పటి నుంచే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతానే ప్రచారం మొదలైంది.
తాజాగా ఆయన తన జిల్లా భారాస అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తేలిపోయింది. బీఎస్పీతో పొత్తును జీర్ణించుకోలేకే కోనప్ప పార్టీని వీడుతున్నారని ప్రచారం సాగుతుంది. కోనప్పతో పాటు జిల్లాలోని ద్వితీయ శ్రేణి నేతలు కూడా అనేక మంది ఆ పార్టీలో చేరుతాని ప్రచారం సాగుతుంది. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న తరుణంలో జిల్లాలో మంచి పట్టున్న నేతగా గుర్తింపు పొందిన కోనేరు కోనప్ప.. భారాసను వీడటం ఆ పార్టీకి గట్టి దెబ్బవంటిదని భావిస్తున్నారు.