గెలిచిన తర్వాత పార్టీ మారితే ఇంటికొచ్చి చితక్కొడతాం : భారాస ఎమ్మెల్యే వార్నింగ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు ఎంతో కష్టపడి గెలిపించిన తర్వాత అభ్యర్థులు పార్టీ మారితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. తమ పార్టీకి చెందిన వెయ్యి మంది కార్యకర్తలను తీసుకొచ్చి వారి ఇంటిమీద దాడి చేసి తుక్కుతుక్కుగా చితక్కొడతామని హుజురాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు గెలిచాక పార్టీ మారితే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఇది నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని పార్టీ అభ్యర్థులందరికీ వర్తిస్తుందని ఆయన తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలనే వదిలిపెట్టలేదని మిమ్మల్ని ఎలా విడిచిపెడతామని ఆయన హెచ్చరించారు.