శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (11:49 IST)

భారాస నుంచి ఫస్ట్ వికెట్ డౌన్ : కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి ఎంపీ

venkatesh netha
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామంటూ హెచ్చరికలు చేస్తున్న భారత రాష్ట్ర సమితి (భారాస)కు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు తేరుకోలేని షాకిచ్చారు. భారాసకు చెందిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతను తమవైపునుకు తిప్పుకున్నారు. దీంతో భారాస తొలి వికెట్ పడిపోయింది. బీఆర్ఎస్‌‍కు చెందిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరడం వెంకటేశ్ నేతాతో ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సీఎంతో కలిసి వేణుగోపాల్ ఇంటికి వెళ్లిన ఆయన.. వివిధ అంశాలపై చ్చించారు. మరోవైపు, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 
 
ఇదిలావుంటే ఇటీవల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం సాగింది. అయితే, నియోజకవర్గ అభివృద్ధి పనుల నిమిత్తమే సీఎం రేవంత్‌ను కలిసినట్టు ఆ తర్వాత వారు వివరణ ఇచ్చారు. అయితే, అనేక బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ గూటికి వచ్చేందు సిద్ధమైపోయినట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. పైగా గత ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో అనేక మంది పూర్వ కాంగ్రెస్ నేతలు కావడం గమనార్హం. దీంతో వీరంతా తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామంటూ ప్రకటనలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు ఈ పరిణామం ఏమాత్రం మింగుడుపడని అంశంగా మారింది.