ఈ-ఫార్ములా కేసు : అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు .. కేటీఆర్
ఈ ఫార్ములా కార్ రేసింగ్‌లో అవినీతి కేసులో తనను అరెస్టు చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఫార్ములా-ఈ కార్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అనుమతించిన విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.
'ఈ కేసులో ఏమీ లేదన్న విషయం అందరికీ తెలుసు. నన్ను అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వం చేయదు. ఫార్ములా-ఈ కార్ కేసులో తప్పు చేయలేదని వంద సార్లు చెప్పా. లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధం. రాష్ట్రంలో కాంగ్రెస్, భాజపా జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తోంది. దేశంలోనే ఇంత అక్రమ బంధం ఎక్కడా ఉండదు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే పరువు పోతుందని రాజీనామాకు అవకాశం ఇస్తున్నారు. దానం నాగేందర్‌తో రాజీనామా చేయిస్తారు. దానంతో రాజీనామా చేయిస్తామని మావాళ్లతో అన్నారు. సాంకేతిక సాకులతో కడియం శ్రీహరిని కాపాడే అవకాశం ఉందేమోనని చూస్తున్నారు' అని కేటీఆర్ అన్నారు.
'పదేళ్లు నేను మంత్రిగా ఉన్నప్పుడు భూముల కోసం చాలా మంది వచ్చారు. డబ్బులు ఇస్తామన్నా కూడా భూమార్పిడికి మేం అంగీకరించలేదు. ఇపుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద భూకుంభకోణానికి తెరలేపింది. దీనికి కేబినెట్‌లో ఆమోదం తెలిపారు. అజమాబాద్ భూముల క్రమబద్ధీకరణకు చట్టం తీసుకొచ్చాం.
వంద శాతం రుసుముతో క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చాం. ఇతరుల చేతిలో ఉంటే 200 శాతం రుసుం పెట్టాం. ప్రభుత్వం ఇప్పుడు చౌకగా భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. 9,292 ఎకరాలు ఎవరి సొత్తు అని సంతర్పణ చేస్తున్నారు? ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. 30 శాతం డబ్బులు చెల్లిస్తే క్రమబద్ధీకరణ చేస్తామంటున్నారు.
భూముల విషయంలో న్యాయ పోరాటం చేస్తాం. కొనేవారు కూడా చిక్కుల్లో పడతారు జాగ్రత్త. భవిష్యత్‌లో వచ్చేది మా ప్రభుత్వమే. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలో చిక్కితే కొనుగోలుదారులు నష్టపోతారు. బీఆర్ఎస్ హయాంలో ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు. అధికారంలోకి వచ్చాక బాధ్యులను వదిలిపెట్టబోం. ఇది రూ.5 లక్షల కోట్ల విలువైన భూకుంభకోణం. రూ.50 వేల కోట్లు వెనకేసుకోవాలని రేవంత్ చూస్తున్నారు. భాజపా నేతలు కూడా ఈ భూకుంభకోణాన్ని అడ్డుకోవాలి' అని కేటీఆర్ అన్నారు.