శనివారం, 1 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2025 (19:08 IST)

మొంథా తుఫాను మృతులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా : సీఎం రేవంత్ రెడ్డి

cm revanth reddy
మొంథా తుఫాను సమయంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం ప్రకటించారు. మొంథా తుఫాను కారణంగా రాష్ట్రంలో సంభవించిన వరదలపై ఆయన హన్మకొండ కలెక్టరేట్‌లో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
ఈ సంజదర్భంగా ఆయన మాట్లాడుతూ, మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలోని 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం, దెబ్బతిన్న రోడ్లపై నివేదికలు తెప్పించాలని, ప్రజాప్రతినిధుల వద్దకు వచ్చిన నివేదికలను కలెక్టర్లకు పంపాలన్నారు. అన్ని నివేదికలు సమీకరించి నిర్ణీత విధానంలో కేంద్రానికి నివేదించాల్సి ఉంటుందన్నారు. 
 
తుఫాను నష్టాలపై కేంద్ర నిధులు రాబట్టుకోవాల్సి ఉందని, ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని అధికారులకు సూచించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. ధనిక రాష్ట్రమని కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వదులకునే ప్రసక్తే లేదన్నారు.
 
ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అందించాల్సిన ఆర్థిక సాయంపై గతంలో ఇచ్చిన జీవో ప్రకారం.. తాజా వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్లు మునిగిన వారికి రూ.15 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. 
 
గుడిసెలు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎకరా పంట నష్టానికి రూ.10 వేలు చొప్పున, ఆవులు, గేదెలు మృత్యువాత పడితే రూ.50 వేలు, మేకలు, గొర్రెలకు రూ.5 వేలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.