బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (11:06 IST)

తనపై అక్రమంగా కేసు పెట్టారన్న కవిత.. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ!!

k kavitha
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తన పాత్ర లేకపోయినప్పటికీ తనపై అక్రమంగా కేసు పెట్టారని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత అన్నారు. పైగా, ఎన్నికల్లో ప్రచారం చేయాల్సివుందని, అందువల్ల తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె కోరారు. ఈ నేపథ్యంలో ఆమె రెగ్యులర్ బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరుగనుంది. అయితే, ఈడీ అధికారులు మాత్రం ఈ కేసులో కవితే కింగ్ పిన్ అంటున్నారని తెలిపారు. రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర అంటూ అభియోగాలు మోపారు. 
 
ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‍లో అరెస్డయిన కవిత.. తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. మరోవైపు, తాను నిర్దోషినని, తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం కోర్టులో విచారణ జరగనుంది. తనపై అక్రమంగా కేసు పెట్టారని పిటిషన్‌లో కవిత పేర్కొన్నారు. ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. అప్రూవర్‌గా మారిన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తనను కేసులో ఇరికించారని ఆరోపించారు.
 
మరోవైపు కవిత లేవనెత్తుతున్న అంశాలను ఈడీ గట్టిగా వ్యతిరేకిస్తుంది. లిక్కర్ కేసులో కవితే కింగ్ పిన్ అని ఈడీ చెపుతోంది. సౌత్ గ్రూప్‌‍కు - ఆప్‌కు మధ్య జరిగిన రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర అని కోర్టుకు తెలిపింది. సాక్ష్యాలు లభించకుండా ఫోన్లలో డిలీట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత వాట్సాప్ డేటాను డిలీట్ చేశారని వెల్లడించింది. ఎంతో పలుకుబడి ఉన్న కవితకు బెయిల్ ఇస్తే... బయటకు వెళ్లిన తర్వాత సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపింది.
 
ఈ నేపథ్యంలో, కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కవితకు రెగ్యులర్ బెయిల్ వస్తుందా? లేదా? కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనే విషయం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.