ఎన్నికల ప్రచారానికి వెళ్లాలి... మధ్యంతర బెయిల్ ఇవ్వండి : మనీశ్ సిసోడియా
లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న తరపున ప్రచారం చేయాల్సివుందని, అందువల్ల తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కోరారు. ఈ మేరకు ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. సిసోడియా పిటిషన్‌ను స్వీకరించిన సీబీఐ, ఈడీ ప్రత్యేక కోర్టు.. దర్యాప్తు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఆయన అభ్యర్థనపై స్పందనలు తెలియజేయాలని ఈడీ, సీబీఐ అధికారులను ఆదేశించింది. అనంతరం దీనిపై విచారణను ఏప్రిల్ 20వ తేదీకి వాయిదా వేసింది.
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు సిసోదియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన తిహాడ్ జైల్లో ఉన్నారు. ఈ కేసుల్లో బెయిల్ కోరుతూ ఆయన పలుమార్లు పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ న్యాయస్థానాల్లో ఊరట లభించలేదు.
మరోవైపు, ఇదే కేసులో ఇటీవల ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌ను కూడా అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఇక, ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ అరెస్టవగా.. ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా.. ఎన్నికల వేళ ఆమ్‌ఆద్మీని బలహీనపర్చేందుకే తమ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని పార్టీ ఆరోపిస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆప్ పోటీ చేస్తోంది.