మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 మార్చి 2024 (09:36 IST)

'తెలంగాణ స్టేట్' కాస్త 'తెలంగాణ' అయింది.. ఇకపై "టిజి" మార్కుతో వాహనాల రిజిస్ట్రేషన్

registration number code
తెలంగాణ స్టేట్ కాస్త తెలంగాణ అయింది. దీంతో వాహనాల రిజిస్ట్రేషన్ ఇక నుంచి టీజీ అనే అక్షరాలతో రిజిస్ట్రేషన్ చేయనున్నారు. గత ప్రభుత్వం వాహనాల రిజిస్ట్రేషన్‌ను టీఎస్ మార్కుతో చేయించింది. ఇందుకోసం కేంద్ర హోం శాఖ అనుమతి కూడా తీసుకున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఆవిర్భవించిన తర్వాత ఆ రాష్ట్రంలో కొనుగోలు చేసే వాహనాలన్నింటికీ టీఎస్ అనే అక్షరాలతోనే రిజిస్ట్రేషన్ చేస్తూ వచ్చారు. 
 
అయితే, ప్రస్తుతం తెలంగాణాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వం టీఎస్ స్థానంలో టీజీగా వాహనాల రిజిస్ట్రేషన్ చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం మంగళవారం గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర రహదారి శాఖ జారీచేసింది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41 (6) కింద 1989 జూన్ 12వ తేదీ నాటికి గెజిట్‌లో మార్పులు చేశారు. దీంతో రాష్ట్రంలో ఇకపై టీజీ మార్కుతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ చేయనున్నారు. 
 
కాగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ మార్కును మార్చేందుకు నిర్ణయించారు. ఈ విషయమై చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. దీంతో కేంద్రం తగు మార్పులు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఫలితంగా ఇకపై రాష్ట్రంలో కొత్త వాహనాలను టీజీ మార్కుతో రిజిస్టర్ చేయనున్నారు.