హైదరాబాద్ నగరంలో కుండపోత.. వరదకు కొట్టుకుపోయిన స్కూటర్!! (Video)
హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తుంది. అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అబిడ్స్, నాంపల్లి, నాగోల్, అంబర్ పేట, అబ్దుల్లాపూర్, జీడిమెట్ల, సూరారం, సుచిత్ర, బషీర్ బాగ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్ పేట, మొహిదీపట్నం, హిమాయత్ నగర్, దిల్‍సుఖ్ నగర్, మలక్ పేట, వనస్థలిపురం, ఉప్పల్, ఫిల్మ్ నగర్, నారాయణగూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, లక్డికాపూర్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.
అలాగే, బీఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్, జగద్గరి గుట్ట, బహదూర్ పల్లి, గుండ్లపోచంపల్లి, పేట్ బషీరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో హైదరాబాద్ నగర రోడ్లన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. అనేక రహదారులపై వర్షపు నీరు ఏరులై పారుతోంది. ఈ వరద నీటిలో వాహనదారుడుతో పాటు అతని ద్విచక్రవాహనం కూడా కొట్టుకునిపోయింది. వరదలో కొట్టుకునిపోతున్న ఆ వాహనాన్ని పట్టుకునేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. మరోవైపు, వర్షం కురుస్తూనే ఉండటంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అలాగే, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరం అయితే తప్పా.. నగర వాసులు ఎవరూ బయటకు వెళ్లొద్దని సూచించారు.