గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2024 (09:22 IST)

కూల్చివేతలపై హైడ్రా నివేదిక - ఆక్రమణలపై భరతం పట్టాలంటూ సీఎం రేవంత్ ఆదేశం

hydra
హైదరాబాద్ నగరంలో నీటి నిల్వ కేంద్రాలను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన భవనాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ముఖ్యంగా చెరువులను ఆక్రమించి నిర్మించుకున్న ఫామ్ హౌజ్‌లు, కన్వెన్షన్ సెంటర్లు, భార భవంతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ఉక్కుపాదం మోపుతుంది. ఇందుకోసం పూర్తి అధికారాలను హైడ్రాకు అప్పగించారు. ఈ కూల్చివేతలపై హైడ్రా తాజాగా ఓ నివేదిక ఇచ్చింది. 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు పేర్కొంది. ఇందులో కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, హీరో అక్కినేని నాగార్జున, రాజకీయ నేత సునీల్ రెడ్డి కట్టడాల కూల్చివేసినట్టు తెలిపింది. అలాగే, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు, ప్రొ కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు కూడా ఉన్నాయని తెలిపింది. లోటస్పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్నగర్, గాజులరామారం, అమీర్పేట్లో అక్రమ కట్టడాలు కూల్చేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. 
 
మరోవైపు, అక్రమ కట్టడాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ, చెరువుల్లో అక్రమ నిర్మాణాలను వదిలేసేది లేదన్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా.. మిత్రులకు ఫాంహౌస్లు ఉన్నా వదలమన్నారు. అక్రమణదారుల చర నుంచి చెరువులకు విముక్తి కల్పిస్తామన్నారు. అక్రమ కట్టడాలకు స్ఫూర్తి భగవద్గీతే.. చెరువుల్లో శ్రీమంతులు ఫాంహౌస్లు కట్టుకున్నారు.. వారి డ్రైనేజీని చెరువుల్లో కలుపుతున్నారు.. రాజకీయం కోసమే.. నాయకులపై కక్ష్యకోసం కూల్చివేతలు చేయడం లేదు.. అక్రమ నిర్మాణాలు వదిలేస్తే నేను ప్రజా ప్రతినిధిగా విఫలమైనట్లే అని తెలిపారు. 
 
అలాగే, హైదరాబాద్ లేక్ సిటీ.. గండిపేట, ఉస్మాన్ సాగర్ హైదరాబాద్ దాహార్తిని తీర్చుతున్నాయి. కొందరు ధనవంతులు చెరువుల పక్కనే ఫాంహౌస్‌లు కట్టుకున్నారు.. ఆ ఫాంహౌస్ నాలాలు గండిపేటలో కలిపారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత భవిష్యత్ తరాల కోసం చేపట్టాం. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.