బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 మార్చి 2024 (16:38 IST)

భార్యతో గొడవలు.. కుటుంబ కలహాలు.. ఉరేసుకున్న జడ్జి

judge
ఎన్నో క్లిష్టమైన కేసుల్లో తీర్పు వెలువరించిన న్యాయమూర్తి తన జీవితంలోని అతిపెద్ద సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారు. తనకు తానే తప్పుడు తీర్పు ఇచ్చి మరణశిక్ష విధించుకున్నాడు. కుటుంబ కలహాలతో కోర్టు న్యాయమూర్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం (మార్చి 24) హైదరాబాద్‌లోని నాంపల్లిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని అంబర్‌పేట బాగ్‌లోని శ్రీనిధి రెసిడెన్సీలోని పోచమ్మ బస్తీలోని ఫ్లాట్ నంబర్ 402లో నివాసం ఉంటున్న ఎ మణికంఠ (36) నాంపల్లి కోర్టులో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (ఎక్సైజ్)గా పనిచేస్తున్నాడు. 
 
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రానికి చెందిన లలితతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే రెండేళ్ల క్రితం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 
 
దీంతో గత కొంతకాలంగా భార్యాభర్తలిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. మణికంఠ భార్య లలిత తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. మణికంఠ తన ప్లాట్‌లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల మణికంఠ తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. అతని తండ్రి ఆసుపత్రిలోనే ఉండి తల్లిని చూసుకుంటున్నాడు. 
 
ఆదివారం (మార్చి 24) మధ్యాహ్నం మణికంఠ తన భార్యకు ఫోన్ చేసి మరోసారి గొడవ పడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మణికంఠ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. 
 
వృత్తిపరంగా ఇరుపక్షాల వాదనలు విని, ఎవరిది తప్పు, ఎవరు ఒప్పు అని బేరీజు వేసుకుని, ప్రతివాదికి శిక్ష విధించే జడ్జి.. తన జీవితంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. గొడవ తర్వాత జడ్జి బెడ్‌రూమ్‌లో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.