శుక్రవారం, 12 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 ఏప్రియల్ 2024 (15:57 IST)

చంద్రబాబు అనే మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు... మాజీ సీఎం కేసీఆర్ ఫైర్

kcrao
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబును ఓ మూర్ఖుడుగా పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో భూదాన్ పోచంపల్లిలో ఏడుగురు చేనేత కార్మికులు ఒకేరోజు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వమని చెప్పానని... ఓ గడువు పెట్టి ఆ లోగా ఇవ్వకుంటే తాను భిక్షాటన చేసి ఇస్తానని హెచ్చరించానని.. అయినప్పటికీ ఆ దుర్మార్గుడు ఇవ్వలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
 
ఆయన ఇవ్వకపోవడంతో నిజామాబాద్ పట్టణం, హైదరాబాద్ నగరంలోని అబిడ్స్‌లో భిక్షాటన చేశానని.. రూ.7 లక్షలు వస్తే ఆ చేనేత కార్మికులకు ఇచ్చినట్లు తెలిపారు. అలా గద్వాల, దుబ్బాక, భువనగిరి, సిరిసిల్లలో రోజూ చనిపోయే చేనేత కార్మికులకు ఎంతోకొంత సాయం అందించే ఉద్దేశ్యంలో భాగంగా కొన్ని పథకాలు పెట్టామన్నారు. అందులో భాగంగానే వారికి ప్రభుత్వం నుండి ఆర్డర్లు ఇచ్చామన్నారు. 
 
తెలంగాణ ఉద్యమం సమయంలో సిరిసిల్లకు వెళుతుండగా గ్రామాల్లో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని గోడల మీద రాతలు కనిపించేవని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు తనతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ ఉన్నారని, చావొద్దని గోడల మీద రాసిన పరిస్థితులు చూసి తమ కళ్ళ వెంట నీళ్లు వచ్చాయన్నారు. 65 ఏళ్ల స్వతంత్ర భారతంలో చావకండంటూ గోడల మీద రాతలు రాసే ప్రభుత్వాలను చూడటం కంటే దౌర్భాగ్యం ఏముందని తాము బాధపడ్డామన్నారు. అందుకే తెలంగాణ వచ్చాక చేనేత కార్మికు ఆదుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు.
 
సిరిసిల్లలో ఒకేరోజు 11 మంది చేనేత కార్మికులు చనిపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి రూ.50 లక్షలు తెచ్చి... ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశామన్నారు. చేనేత కార్మికులకు అండగా ఉండాలని ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ట్రస్ట్ ఇప్పటికీ సిరిసిల్లలో ఉందన్నారు. దయచేసి ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని... తెలంగాణ వస్తది... వచ్చాక బిడ్డల్లా చూసుకుంటామని చేనేత కార్మికులకు హామీ ఇచ్చామన్నారు. ఆత్మహత్యలు వద్దని చేనేత కార్మికులకు చెప్పామన్నారు. అనుకున్నట్లుగా దేవుడి దయవల్ల తెలంగాణ వచ్చిందని... మన ప్రభుత్వం వచ్చిందని, ఆ తర్వాత నేతలన్నలను తమ ప్రభుత్వం ఆదుకుందని ఆయన చెప్పారు.