సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 ఏప్రియల్ 2024 (20:51 IST)

మోదీ.. తప్పితే ఈడీ.. ఇదేనా బీజేపీ రాజ‌కీయం..? కేసీఆర్ ఫైర్

kcrao
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఈ ప‌దేండ్ల‌లో ప్ర‌జ‌ల్లో భావోద్వేగాలు పెంచ‌డం త‌ప్ప ఒక్క మంచి ప‌ని కూడా చేయ‌లేదని దుయ్యబట్టారు. అయితే మోదీ.. తప్పితే ఈడీ.. ఇదేనా బీజేపీ రాజ‌కీయం..? అని కేసీఆర్ నిల‌దీశారు. ఇదేనా ప్ర‌జాస్వామ్యాన్ని ఎక్క‌డిక‌క్క‌డ పాత‌రేసే ప‌ద్ధ‌తి..? అంటూ కేసీఆర్ బీజేపీ ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించారు. 
 
"నా మెడ మీద క‌త్తి పెట్టి రాష్ట్రానికి నిధులు బంద్ చేస్తా.. సంవ‌త్స‌రానికి రూ. 5 వేల‌ కోట్లు గుంజుకుంటా.. రైతుల మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టాల‌న్నాడు మోదీ. నా ప్రాణం పోయినా మీట‌ర్లు పెట్ట‌ను అని చెప్పాను. నేను మీట‌ర్లు పెట్ట‌లేదు. ఆనాడు ఏడాదికి రూ. 5 వేల కోట్లు కోసిండు మోదీ. అలా రూ. 30 వేల కోట్ల న‌ష్టం వ‌చ్చింది. 
 
రైతాంగాన్ని కాపాడుకోవాల‌ని, వారి బాధ‌లు తెలుసు కాబ‌ట్టి, క‌రెంట్ అవ‌స‌రం కాబ‌ట్టి వాళ్ల మీద భారం ప‌డొద్ద‌ని మీట‌ర్లు పెట్ట‌లేదు. ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే మాకు ఓటేసిండ్రు మీట‌ర్లు పెట్టండి అంట‌రు. మీట‌ర్లు రావొద్దు అంటే ఓటు వేయొద్దు.. బీజేపీని నేల‌కేసి గుద్దాలి. అప్పుడే మ‌న‌కు స‌రైన తెలివి ఉన్న‌ట్టు.. రాజ‌కీయ ప‌రిజ్ఞానం ఉన్న‌ట్టు. ద‌య‌చేసి ఆలోచించండి." అంటూ కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. 
 
బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం.. తెలంగాణ ప్రయోజనాల కోసమని కేసీఆర్‌ అన్నారు. తాను బతికి ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తా తప్ప నోరు మూసుకుని కూర్చోనని స్పష్టం చేశారు.