సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 26 జులై 2024 (12:25 IST)

దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు : జైలులో కీలక దోషి మృతి!!

jail
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో కీలక దోషి ఒకరు జైలులో మృతి చెందాడు. ఆ ముద్దాయి పేరు సయ్యద్ మక్బూల్. ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన ఉగ్రవాది. ప్రస్తుత చర్లపల్లి జైలులో అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన సయ్యద్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
 
మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన మక్బూల్ దేశ వ్యాప్తంగా జరిగిన పలు బాంబు పేలుడు ఘటనల్లో సంబంధం ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. పైగా, ఆయనపై హత్య, హత్యాయత్నం కేసులో అనేకం ఉన్నాయి. ఇక 2013 నాటి దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ముఖ్య నిందితుడై మక్బూల్‌కు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జీవితఖైదు విధించింది. ఆరు నెలల క్రితం అతడిపై హైదరాబాద్‌లో మరో కేసు కూడా నమోదైంది. దీంతో పోలీసులు ట్రాన్సిట్ వారెంట్‌పై మక్బూల్‌ను ఢిల్లీ నుంచి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారు. 
 
దిల్‌సుఖ్ నగర్‌లో 2013 ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీలు ఒక్కసారిగా పేలిపోయిన విషయం తెల్సిందే. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
అలాగే, దిల్‌సుఖ్ నగర్‌లోని 107 బస్టాప్ వద్ద ఐఈడీ పేలిన ఆరు సెకన్ల వ్యవధిలో ఏ1 మిర్చీ సెంటర్ వద్ద మరో బాబు పేలింది. ఈ ఘటనల్లో 126 మంది గాయపడగా, వీరిలో 78 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ పేలుళ్లలో గాయపడిన అనేక క్షతగాత్రులు ఇప్పటికీ మంచాలకే పరిమతమైవున్నారు.