ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 జనవరి 2024 (10:26 IST)

కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో రైళ్ల హాల్ట్‌కు కేంద్రం ఓకే

train
తెలంగాణ రాష్ట్రంలోని మనోహరాబాద్‌ - కొత్తపల్లి రైల్వే మార్గం నిర్మాణంలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో రైలు నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఒకే చెప్పింది. కొమురవెల్లి శివారు నుంచి రైల్వే మార్గాన్ని నిర్మించగా.. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కి నిత్యం రైలు రాకపోకలు సాగిస్తోంది. అయితే మార్గమధ్యలోని కొమురవెల్లిలో హాల్టింగ్‌ లేకపోవడం గమనార్హం. ఇక్కడ స్టేషన్‌ ఏర్పాటుకు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు.. రైల్వే అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతిధులకు విన్నవించారు. ఎట్టకేలకు కొమురవెల్లి శివారు నుంచి వెళ్తున్న రైల్వే మార్గంపై హాల్టింగ్‌ స్టేషన్‌ నిర్మిస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటనతో మల్లన్న భక్తులు, స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
 
ఈ స్టేషన్ ఏర్పాటుతో లక్షలాది మందికి ప్రయోజనం కలుగనుంది. స్వామి దర్శనానికి ఏటా 25 లక్షల మందికి పైగా నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. సుమారు 70 శాతం మంది సామాన్యులే ఉంటారు. వారంతా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో ఆలయానికి చేరుకుంటారు. బస్సుల్లో వచ్చే వారికి రాజీవ్‌ రహదారి నుంచి 3 కి.మీ. దూరంలోని కొమురవెల్లి చేరుకోవడానికి, తిరిగి ఇంటికి వెళ్లేందుకు ప్రయాణికులు ప్రధాన రహదారిపై గంటల కొద్దీ నిరీక్షించాల్సిందే. 
 
హైదరాబాద్‌ నుంచి 110 కి.మీ., కరీంనగర్‌ నుంచి 90 కి.మీ. రెండు, మూడు వాహనాలు మారుతూ ప్రయాణించాల్సిందే. హైదరాబాద్‌ నుంచి ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.150, కరీంనగర్‌ నుంచి రూ.100 ఖర్చు తప్పదు. రైలు ప్రయాణమైతే సగం భారం తగ్గే అవకాశం ఉంటుంది. కొమురవెల్లి సమీపంలో రైల్వేస్టేషన్‌ ఏర్పాటు చేస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం.