కార్తీకమాసం గుడి ప్రదక్షణలు చేస్తూ.. గుండెపోటుతో యువకుడి మృతి (video)
గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఓ యువకుడు రెప్పపాటు కాలంలో ప్రాణాలు కోల్పోయాడు. గుడిలో ప్రదక్షణలు చేస్తుండిన యువకుడు గుండెపోటు కారణంగా మృతి చెందాడు. ఈ విషాద సంఘటన హైదరాబాద్ మహానగరం పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కేబీహెచ్‌బీ రోడ్ నెంబర్ 1 లో అమ్మ హాస్టల్లో విష్ణువర్ధన్ అనే యువకుడు ఉంటున్నాడు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న విష్ణువర్ధన్ ప్రతిరోజు ఉదయం వీరాంజనేయ స్వామి ఆలయానికి వెళుతుంటాడు.
ఈ క్రమంలోనే ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఉండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. రోజూ గుడికి వెళ్లే అతనికి ఎప్పటిలాగానే గుడికి వెళ్లి ప్రదక్షణలు చేశాడు.
కానీ అలసటగా వుండటంతో మంచినీరు తాగి మళ్లీ ప్రదక్షణలు చేశాడు. కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆలయ అర్చకులు భక్తులు విష్ణువర్థన్‌ను పైకి లేపడానికి ప్రయత్నించారు. అయినా అతనిలో ఎలాంటి చలనం లేకపోయింది.
దీంతో చివరకు 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. విష్ణువర్ధన్‌ను పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.