సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 26 మార్చి 2024 (15:39 IST)

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : కవితకు జ్యూడిషియల్ రిమాండ్... తిహార్ జైలుకు తరలింపు!!

Kavitha
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆమెను ఢిల్లీలోని తిహార్ జైలుకు తరలించారు. ఆమెకు ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్ కొనసాగనుంది. మరోవైపు, ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ ఒకటో తేదీన విచారణ జరగనుంది. 
 
ఈ కేసులో ఆమెకు కస్టడీ ముగియడంతో ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వాదోపవాదనలు జరిగాయి. ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ ఆన్‌లైన్‌లో తమ వాదనలు వినిపిస్తూ, 15 రోజుల జ్యూడీషియల్ రిమాండ్‌కు పంపాలన కోరారు. పైగా, ఈ కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని ఉందని, పలువురు నిందితులను ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. ఆమె తరపు న్యాయవాది మాత్రం తన క్లయింట్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఆమె కుమారుడికి పబ్లిక్ పరీక్షలు ఉన్నాయని, షెడ్యూల్ కూడా విడుదలైందని తెలిపారు. ఇరువైపులా వాదనలు ఆలకించిన న్యాయమూర్తి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్‌క విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత ఆమెను తిహార్ జైలుకు తరలించారు. 
 
కాగా, కోర్టులో హాజరుపరిచిన సమయంలో కవిత మీడియాతో మాట్లాడుతూ, ఇది తప్పుడు కేసు. మనీలాండరింగ్ కేసు కాదు. పొలిటికల్ లాండరింగ్ కేసు. ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తా. నన్ను తాత్కాలికంగా జైలులో పెట్టొచ్చు. నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఇప్పటికే ఒక నిందితుడు భారతీయ జనతా పార్టీలో చేరారు. మరో నిందితుడికి ఆ పార్టీ టిక్కెట్ ఇస్తోంది. మూడో నిందితుడు రూ.50 కోట్లు బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడు అని పేర్కొన్నారు.