రైతులకు సాయం చేసిన పోలీసులు.. వరిపంట తడిసిపోకుండా..?
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్‌లో లోక్ సభ ఎన్నికల కోసం ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. అక్కడ కేంద్ర, రాష్ట్ర స్థాయి, స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
అయితే పక్కనే ఉన్న వ్యవసాయ మార్కెట్‌లో రైతులు వరి ధాన్యాన్ని నిల్వ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం మొదలైంది. దీంతో వరిపంట తడిసిపోకుండా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు రైతుల కష్టాలను గమనించారు.
పోలీసులు వెంటనే వారి వద్దకు వెళ్లి ధాన్యం తడిసిపోకుండా రైతులకు సహకరించారు. పోలీసుల మానవత్వాన్ని అక్కడి ప్రజలంతా మెచ్చుకున్నారు. అనంతరం రైతులు పోలీసులకు చేతులు జోడించి నమస్కరించారు. ఈ ఘటనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన వారంతా సెల్యూట్ పోలీస్ అంటూ సోషల్ మీడియాలో పోలీసుల సహాయాన్ని కొనియాడుతున్నారు.