శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 17 జనవరి 2024 (09:28 IST)

దావోస్‌లో బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి... 2 రోజుల్లో 60 భేటీలు

revanth in davos
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన తొలి విదేశీ పర్యటన సందర్భంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న 54వ ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్‌)లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సదస్సు సోమవారం ప్రారంభంకాగా.. ఆయన కేవలం రెండు రోజుల్లో ఏకంగా 60 మంది వివిధ దేశాల రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ సర్కారు విధానాలను వారికి వివరిస్తూ.. హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను గురించి విశదీకరిస్తున్నారు. డబ్ల్యూఈఎఫ్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో ఆయన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఈ భేటీల్లో పాల్గొన్నారు. అమెజాన్‌ ఉపాధ్యక్షుడు మైఖేల్‌ పుంకేతో జరిగిన భేటీలో రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో ఆ సంస్థ పెట్టుబడుల విస్తరణపై చర్చించారు. 
 
ఇప్పటికే హైదరాబాద్‌లో అమెజాన్‌ డేటా సెంటర్‌, రెండో అతిపెద్ద కార్యాలయం ఉన్న విషయం తెలిసిందే. నోవార్టిస్‌ సీఈవో వాస్‌ నరసింహన్‌తోనూ రేవంత్‌రెడ్డి చర్చలు జరిపారు. ఆ సంస్థ ప్రధాన కేంద్రం స్విట్జర్లాండ్‌లో ఉండగా.. భారత్‌ కేంద్రంగా హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయం కొనసాగుతోంది. ఇక్కడ పరిశోధన, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ), క్లినికల్‌ డెవలప్‌మెంట్‌, మెడికల్‌ రైటింగ్‌కు సంబంధించిన విభాగాలున్నాయి. భవిష్యత్‌లో నోవార్టిస్‌ విస్తరణలో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. 
 
తొలిరోజు సదస్సు సందర్భంగా డబ్ల్యూఈఎఫ్‌ అధ్యక్షుడు బోర్గ్‌ బ్రెండ్‌, ఇతర నిర్వాహకులతో రేవంత్‌ భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వారితో చర్చించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను వారికి వివరించారు. ఇథియోపియా ఉప ప్రధాని డెమెక్‌ హసెంటోతో జరిగిన సమావేశంలో పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్‌మ్యాప్‌ను వివరించారు. 
 
ప్రభుత్వాలతో పాటు పారిశ్రామికవేత్తలు, వ్యాపార వాణిజ్య వాటాదారులు కలిసికట్టుగా పనిచేస్తే.. ప్రజలు సంపన్నులవుతారని, రాష్ట్రంలో సుస్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రేవంత్‌ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. సీఎం నిర్వహించిన వరుస భేటీల్లో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌, ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రమోషన్స్‌ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.