కేసీఆర్ కుటుంబంలో మరో షర్మిలగా ఎమ్మెల్సీ కవిత : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ కుటుంబంలో మరో షర్మిల పుట్టుకొచ్చారని ఆమె ఎవరో కాదని కేసీఆర్ ముద్దుల తనయ కె.కవిత అని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.
తమ పార్టీ అధినేత కేసీఆర్‌కు కె.కవిత రాసిన లేఖ బహిర్గతమైంది. ఈ లేఖ బీఆర్ఎస్‌లో సంచలనంగా మారింది. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలో చర్చనీయాంశంగా మారింది.
దీనిపై నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభాకర్ మాట్లాడుతూ, ఆ కుటుంబంలో అంతర్గత కలహాలు తీవ్ర స్థాయికి చేరాయని, కవిత భవిష్యత్తులో మరో షర్మిలగా మారే అవకాశాలున్నాయని జోస్యం చెప్పారు.
'కవిత బాధ... తాను కేసీఆర్‌కు రాసిన లేఖ బయటపడిందని కాదు... రాజకీయ పార్టీలతో రహస్యంగా కుదిరిన ఒక ఒప్పందం బహిర్గతమైందనేదే ఆమె అసలు ఆవేదన' అని ప్రభాకర్ ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడిన వారిని కాపాడుకోవడానికి వీరంతా ప్రయత్నిస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని, ఇరు పార్టీల నేతల మధ్య రాజీ కుదిరిందని ఆయన ఆరోపించారు. ఈ రహస్య ఒప్పందం విషయం ఎలా బయటకు పొక్కిందనే అంశంపై కేసీఆర్ కుటుంబంలోని నలుగురు కీలక సభ్యుల మధ్య తీవ్రంగా చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.