ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2024 (09:46 IST)

మరో పదేళ్లపాటు నేనే సీఎం.. రా.. బిడ్డా.. ఎట్ల వస్తవో.. ఇక్కడే ఉంటా.. నీ సంగతేంటో చూస్తా : రేవంత్ రెడ్డి

revanth reddy
మరో పదేళ్ల పాటు తానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం రేవంత్ ప్రకటించారు. తెలంగాణాలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌కు సూటిగా సవాల్ విసురుతున్నట్టు తెలిపారు. చేతనైతే ఒక్క వెంట్రుక పీకి చూడాలని బహిరంగ సవాల్ విసిరారు. ఆయన వెంటనే అధికారంలోకి వస్తా అంటున్నడని.. రా.. బిడ్డా.. ఎట్ల వస్తవో.. ఇక్కడో ఉంటా.. నీ సంగతేంటో చూస్తానని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రావడానికి అయితలేదు కానీ కేసీఆర్ నల్గొండకు పోయిండని ఆయన మాటల మాయలో పడొద్దని సూచించారు. పోలీసు శాఖలో శిక్షణకు ఎంపికై 13445 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఆయన బుధవారం నియామక పత్రాలను అందజేశారు. 
 
ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ.. పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును గెలిపించారని నల్లగొండ సభలో కేసీఆర్‌ అన్నారని, కానీ.. ప్రజలు కంచర గాడిదను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని గెలిపించారని, ఏ పోటీకెళ్లినా ఈ రేసు గుర్రానిదే గెలుపన్నారు. 'అసెంబ్లీలో చర్చకు రాలే. నీళ్ల మీద చర్చ అంటే రాలే. నిధుల మీద చర్చ అంటే రాలే. నియామకాలపై మాట్లాడదామంటే రాలే. కానీ నల్లగొండకు పోయి బీరాలు పలికిండు. పొంకనాలు కొడుతున్నారు. 
 
ఈ రోజు అసెంబ్లీలో ఓ అటెండర్‌ నాతో మాట్లాడాడు. సార్‌ ఎల్బీ స్టేడియంలో ఒక్క మాట మీరు చెబితే వింటా అన్నాడు. కంచర గాడిదను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని చెప్పండి అన్నాడు. ఆ కంచర గాడిదకు మళ్లీ అధికారం అన్నది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్‌ అని కోరాడు. ఆ అటెండర్‌కు ఉన్న ఇంగిత జ్ఞానం సీఎంగా పనిచేసిన చంద్రశేఖరరావుకు లేదు. ఆయన మళ్లీ వస్తాడంటా. నడవడానికే వస్తలేదంటివి, వీల్‌ చైర్‌లో తిరుగుతున్నా అంటున్నావు. ఎట్లొస్తావని నేను అడుగుతున్నా అని రేవంత్‌ అన్నారు. 
 
'సచ్చిన పామును సంపనీకి మాకేమైనా పిచ్చా. నీ పనైపోయింది. ఖేల్‌ ఖతం. దుకాణ్‌ బంద్‌. దీంతో చిన్నగా సానుభూతి కథ మొదలుపెట్టిండు. సావు నోట్ల తలపెట్టి తెలంగాణ సాధించిన అని చెబితే చూడలేదు కాబట్టి పిల్లలు నిజమే అనుకున్నారు. ఇవాళ నీ డ్రామాలు చూసిర్రు. ఉత్తప్పుడు బాగనే నడుస్తుండు. మీటింగ్‌కు రాగానే వీల్‌ చైర్‌లో కూసుంటుడు' అని సీఎం వ్యాఖ్యానించారు. 'తెలంగాణ ఏర్పడిన వెంటనే కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్‌.. తెలంగాణ పిల్లలు ఏం పాపం చేశారని 30 లక్షల మంది 3,650 రోజుల పాటు ఉద్యోగాలకు ఎదురుచూసేలా చేశావ్‌? మేం ఉద్యోగాల దిశగా ఆలోచన చేస్తుంటే కాళ్లల్లో కట్టెపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావ్‌? అడుగుతున్నా. ఇప్పటికైనా మీకు అర్థం కాలేదా? మీ కుటుంబాన్ని తెలంగాణ సమాజం బహిష్కరించింది' అంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.