కాంగ్రెస్ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ : మాజీ మంత్రి షబ్బీర్ అలీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ గేట్లు ఎత్తివేస్తే భారత రాష్ట్ర సమితి ఖాళీ అవుతుందని, ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, అందువల్ల గాంధీ భవన్ ద్వారాలు తెరిస్తే ఆ పార్టీ ఖాళీ అవుతుందని ఆయన చెప్పారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో... పడిపోతుందో అంటూ మాజీ మంత్రి కేటీఆర్ అహంకారపు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మేం కనుక ద్వారాలు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమన్నారు. కానీ పార్టీలో చేరికల విషయమై తమ అధిష్టానం ఇప్పుడు వద్దని చెబుతోందన్నారు. పార్టీ ఫిరాయింపులు వద్దనడం వల్ల ఆగామని లేదంటే ఇతర పార్టీలకు చెందిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారన్నారు.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ అని జోస్యం చెప్పారు. పదేళ్లలో తెలంగాణను కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదని... అప్పుడే బీఆర్ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారన్నారు. తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల తర్వాత ఖాళీ కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.