సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 జనవరి 2024 (19:59 IST)

సీఎం పదవికి ఉదయం రాజీనామా... సాయంత్రం ప్రమాణ స్వీకారం.. ఎవరు?

nitish kumar
బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఆదివారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. సాయంత్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా గత రెండేళ్ల వ్యవధిలో ఇలా చేయడం ఇది ఆయనకు రెండోసారి కావడం గమనార్హం. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9వ సారి ప్రమాణం చేశారు. ఇండియా కూటమికి టాటా చెప్పేసిన కొన్ని గంటలకే బీజేపీ మద్దతు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. దీంతో ఆయన సారథ్యంలోని జేడీయూ.. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో చేరడం ఇక లాంఛనంగా మారనుంది. 
 
విపక్షాల కూటమి నుంచి వైదొలగిన ఆయన... ఆర్జేడీ పార్టీ మద్దతును ఉపసంహరించుకుంటూ ఆదివారం ఉదయం రాజీనామా చేశారు. దీంతో 18 నెలల కిందట మద్దతు ఇచ్చిన ఆర్జేడీకి నితీశ్ కుమార్ తేరుకోలేని షాకిచ్చారు. ఆర్జేడీతో పొత్తు బంధం తెగిపోయిందని ప్రకటించి బీజేపీ మద్దతుతో తిరిగి సాయంత్రం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. గవర్నర్ సమక్షంలో ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. దీంతో బీహార్ ముఖ్యమంత్రిగా 9వ సారి ఆయన సీఎంగా ప్రమాణం చేసినట్టయింది. 
 
నితీశ్‌తో పాటు జేడీయు తరపున విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రావణ్ కుమార్‌లు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక బీజేపీ తరపున సామ్రాట్ చౌదరి, డాక్టర్ ప్రేమ్ కుమార్, విజయ్ సిన్హా, హిందుస్థానీ అవామ్ మోర్ఛా అధ్యక్షుడు డాక్టర్ సంతోష్ కుమార్, స్వతంత్ర ఎమ్మెల్యే సుమతి కుమార్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా బీహార్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగిపోయింది. జాతీయ మీడియాలో వచ్చిన కథనాల మేరకు ఆయన ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పేశారు.