బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 24 జనవరి 2024 (11:50 IST)

బీఆర్ఎస్‌ను 39 ముక్కలు చేస్తాం.. తస్మాత్ జాగ్రత్త.. మంత్రి కోమటిరెడ్డి వార్నింగ్

komatireddy
భారత రాష్ట్ర సమితి (భారాస) నేతలకు కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మేం తలచుకుంటే బీఆర్ఎస్‌ను 39 ముక్కలు చేస్తామంటూ హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరు నెలల్లో పడిపోతుందని భారాస నేతలు కేటీఆర్, హరీశ్ రావులు పదేపదే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గట్టిగా స్పందించారు. భారత రాష్ట్ర సమితి పార్టీకి ఇపుడు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అందువల్ల మేం తలచుకుంటే ఆ పార్టీని 39 ముక్కలు చేస్తామని హెచ్చరించారు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల తర్వాత భారాసకు చెందిన 39 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆయన జోస్యం చెప్పారు. 
 
మంగళవారం ఆయన నల్గొండ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం పడిపోతుందని చెప్పడం ద్వారా ఎప్పుడూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం పైనే దృష్టి సారించారని ఆరోపించారు. కానీ నెల రోజుల్లో మేమే వారి పార్టీని 39 ముక్కలు చేస్తామన్నారు. తమ ప్రభుత్వం పడిపోయే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోస్యం చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీలో పది మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరన్నారు. 
 
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. అదేసమయంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని కోమటిరెడ్డి హెచ్చరించారు. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలలో అక్రమాలతో పాటు ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందనే అక్కసుతో తనపై ఆయన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.