బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 జనవరి 2024 (11:56 IST)

మీ వెబ్‌సైట్స్ వ్యూస్ కోసం నా పేరు వాడుకుంటారా... తాట తీస్తా : దిల్ రాజు స్ట్రాంగ్ వార్నింగ్ (Video)

Dil Raju ph
వెబ్‌సైట్ యజమానులకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీ వెబ్‌సైట్స్, యూట్యూబ్ వ్యూస్ కోసం తన పేరును వాడుకుంటూ, తప్పుడు వార్తలు రాస్తారా... తాట తీస్తానంటూ బహిరంగంగానే హెచ్చరించారు. ప్రతి సంక్రాంతికి కొత్త సినిమాలు విడుదలవుతుంటాయని, ఏదో ఒక రకంగా తనను వివాదాల్లోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో ఆయన కాస్తంత కఠువుగానే మాట్లాడారు.
 
'నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. మీ వెబ్‌సైట్లకు వ్యూస్ వచ్చేందుకు నా పేరును వాడుకుంటే సహించేదిలేదు... తాట తీస్తా! నా గురించి తప్పుడు వార్తలు రాసే వెబ్‌సైట్లకు ఇదే నా హెచ్చరిక" అని దిల్ రాజు స్పష్టం చేశారు. "నిన్న హనుమాన్ ఫంక్షన్‌లో చిరంజీవి మాట్లాడుతూ చక్కగా చెప్పారు. దిల్ రాజు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి... ఏ పరిస్థితుల్లో ఏం చేయాలో ఆయనకు తెలుసు అని మంచిగా చెప్పారు. కానీ చిరంజీవి వ్యాఖ్యలను కొన్ని వెబ్‌సైట్లు వక్రీకరించాయి. మరో అర్థం వచ్చేలా ఆ వెబ్ సైట్లలో రాశారు.
 
మీ వెబ్‌సైట్ ప్రాముఖ్యతను పెంచుకునేందుకు ఇతరుల గురించి తప్పుడు వార్తలు రాస్తారా? ఇతరులను ఎందుకు వాడుకుంటున్నారు? మీకిది అవసరమా? దిల్ రాజు మెతక అనుకుంటున్నారా? చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నాను. ఎందుకులే... సాఫ్ట్‌గా వెళదాం అని అనుకునేవాడ్ని. కానీ ఈ రాతలు చూశాక ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేదిలేదు.
 
మీకేమైనా ఆ చిత్ర నిర్మాత చెప్పాడా...? ఆ వెబ్ సైట్లకు దమ్ముంటే ఆ నిర్మాతను ఈ వేదికపైకి తీసుకువచ్చి... నన్ను, ఆ నిర్మాతను ప్రశ్నించండి. ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్ను టార్గెట్ చేస్తుంటారు? ఇండస్ట్రీలో 95 శాతం మంది నన్ను ఇష్టపడతారు. మిగతా ఐదు శాతం మంది నన్ను ఇష్టపడతారా లేదా అన్నది వాళ్లిష్టం. చాలామందితో నేను సంతృప్తికరంగా వ్యవహరిస్తున్నాను కాబట్టే ఇండస్ట్రీలో ఇవాళ నాకింత మంచిపేరుంది. దిల్ రాజు అంటే ఒక బ్రాండ్. కానీ వ్యాపారపరంగా వచ్చే కొన్ని వివాదాలను తీసుకుని వాటిని వాడుకుంటున్నారు. అది 100 శాతం తప్పు.
 
సంక్రాంతి సినిమాలకు సంబంధించి మొన్న చాంబర్ ద్వారా సమావేశం ఏర్పాటు చేసి రవితేజని ఒప్పించి ఒక సినిమాను సంక్రాంతి బరి నుంచి పక్కకు జరిపాం. అది ఎంత కష్టమో మాకు తెలుసు. ఆ తర్వాత... దిల్ రాజు ఒక తమిళ సినిమా విడుదల చేస్తున్నాడంటూ వార్త రాశారు. ఎవరు చెప్పార్రా నీకు... నేను తమిళ సినిమా రిలీజ్ చేస్తున్నాను అని? ఏదైనా ఆధారం ఉందా? తెలుగులో ఇప్పుడు వద్దు అని ఆ తమిళ సినిమాను కూడా వాయిదా వేయించింది నేను. ఇందాక చెప్పాను కదా తాటతీస్తాను అని... దాన్ని ఈజీగా తీసుకోవద్దు. ఇన్నిరోజులు ఎలాగో నడిచిపోయాయి... ఇక నుంచి నా గురించి వివాదాస్పదమైన వార్తలు రాస్తే ఊరుకునేదిలేదు" అంటూ దిల్ రాజు హెచ్చరించారు.