తల్లిదండ్రులు పుస్తకాలు కొనివ్వలేదు.. 11 ఏళ్ల బాలుడు ఆత్మహత్య
తల్లిదండ్రులు పుస్తకాలు కొనివ్వకపోవడంతో మనస్తాపానికి గురైన 11 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం జిల్లాలోని బెండలపాడులో సుధీర్ బాబు తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలుడు పుస్తకాల కోసం తల్లిదండ్రుల నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. కానీ తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు. ఇదే జిల్లాలో జరిగిన మరో ఘటనలో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అనారోగ్యంతో మనస్తాపానికి గురైన ఎస్.విజయ్ (19) తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయ్ డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థి. అనారోగ్యం కారణంగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని పోలీసుల విచారణలో వెల్లడి అయ్యింది.