తెలంగాణలో కరోనా ఉధృతి.. 13మంది వైద్య కళాశాల విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా నల్గొండ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలలో 13మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. కోవిడ్ పరీక్షల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం కళాశాలలోని 131 మంది విద్యార్థులకు ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించింది.
ఈ పరీక్షల్లో జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలలో 13 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది. వారిలో మరో 10 మందికి వైరస్ సోకినట్లు డీఎంహెచ్‌వో కొండలరావు తెలిపారు. బాధితులను ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు డీఎంహెచ్‌వో చెప్పారు.
మరోవైపు కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న దృష్ట్యా అన్ని యూనివర్సిటీల పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు అన్ని విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు.
మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత పరీక్షలను రీషెడ్యూల్ చేస్తామని పాపిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.