శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (14:48 IST)

నాన్నా... అసలే డబ్బుల్లేవ్... ఎందుకు తాగొచ్చావ్ అన్నందుకు, ఉరి వేసి...

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చంపేట్ గ్రామంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మద్యం మత్తులో తన ఇద్దరు కన్నకూతుళ్లకూ ఉరివేసి అనంతరం తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. ఆర్థిక కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో రాజేందర్ నివాసం ఉంటున్నాడు. గత ఏడాది రాజేందర్ భార్య చనిపోవడంతో తన ఇద్దరి ఆడబిడ్డలతో జీవనం సాగిస్తున్నాడు. భార్య చనిపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవడంతో మద్యానికి బానిసైపోయాడు రాజేందర్. రోజూ మద్యం తాగి వచ్చి కూతుళ్లతో గొడవపెట్టుకునే వాడని తెలిసింది. 
 
ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా ఇంటికి తాగి వచ్చాడు. దీంతో పిల్లలు... నాన్నా, అసలే డబ్బుల్లేకపోతే మద్యం ఎందుకు తాగుతున్నావ్ అంటూ గొడవపడినట్లు తెలిసింది. మద్యం మత్తులోనైనా కష్టాన్ని మర్చిపోవాలని ఇలా చేస్తున్నానని చెప్పడం, ఆ తర్వాత పిల్లలు మళ్లీ అతడితో గొడవకి దిగడంతో కోపోద్రిక్తుడైన రాజేందర్ మద్యం మత్తులోనే తన పిల్లలు భవాని(9 సంవత్సరాలు), లక్ష్మి(5 సంవత్సరాలు) ఉరివేసి చంపేసినట్టు తెలిసింది.

అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పిల్లలను పోషించే స్తోమత లేకే ఈ అఘాయిత్యానికి రాజేందర్ పాల్పడినట్టు గ్రామస్తులు వాపోతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.