శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: సోమవారం, 11 మార్చి 2019 (14:44 IST)

ఆన్‌లైన్‌లో కొన్న కారు... కళ్ల ముందే భార్యపిల్లలు సజీవ దహనం...

ఢిల్లీలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం దైవాన్ని దర్శించుకునేందుకు వెళ్తున్న కుటుంబ సభ్యులను మృత్యువు కబళించింది. ప్రమాదం జరిగిన తీరును ప్రత్యక్షంగా చూసినవారు షాక్‌కు గురయ్యారు. కళ్ల ముందే భార్యాపిల్లలు సజీవ దహనం అవుతుంటే ఆ కుటుంబ పెద్ద గుండెలవిసేలా రోదించాడు. కానీ మృత్యువుకి కనికరం లేదు... కబళించేసింది.
 
వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి చెందిన మిశ్రా ఇటీవలే ఆన్ లైన్లో ఓ కారును కొన్నాడు. ఆ కారును పెద్దగా ఉపయోగించడంలేదు. కానీ ఆదివారం నాడు భార్యతో పాటు తన ముగ్గురు కుమార్తెలను తీసుకుని అక్షరధామ్ ఆలయ సందర్శన చేసుకునేందుకు బయలుదేరాడు. ఐతే అక్షర్‌ధామ్‌ ఫ్లెఓవర్‌ పైకి రాగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 
 
వెంటనే కారును పక్కనే ఆపి డ్రైవర్ సీటు పక్కనే వున్న తన చిన్న కుమార్తెను బయటకు లాగేశాడు. ఆ తర్వాత వెనక సీట్లు వున్న భార్య-ఇద్దరు కుమార్తెలను రక్షించేందుకు కారు డోర్లు తెరవబోయాడు. ఐతే అంతలోనే మంటలు చుట్టుముట్టాయి. ఐనా అతడు కారు డోర్లు తీసేందుకు ప్రయత్నిస్తుండటంతో స్థానికులు అతడిని వెనక్కి లాగారు. లేదంటే అతడు కూడా అగ్నికి ఆహుతయ్యేవాడు. కానీ తన కళ్లముందే భార్యాపిల్లలు సజీవ దహనం అవుతుండటంతో గుండె పగిలేలా రోదించాడు. 
 
ప్రత్యక్ష సాక్షులు కూడా కళ్లవెంట నీళ్లుపెట్టుకున్నారు. చూస్తుండగానే కారు బుగ్గయ్యింది. అగ్నిమాపక దళం రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చింది. అప్పటికే ముగ్గురు గుర్తుపట్టలేనివిధంగా దహనమయ్యారు. సీఎన్జీ గ్యాస్‌ లీక్‌ కావడం వల్లే మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.