తెలంగాణా విమోచన దినోత్సవం... నివాళులు అర్పించిన అమిత్ షా
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు హైదరాబాద్ నగరంలో జరిగాయి. సికింద్రబాద్ పరేడ్ మైదానంలో జరిగిన ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. వార్ మెమోరియల్లో అమరవీరులకు నివాళులు అర్పించారు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కేంద్ర బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సశస్త్ర సీమ బల్‌ను ఆయన వర్చువల్గా ప్రారంభించారు.
ఇందులో హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విమోచనం కోసం పోరాడిన వీరులకు వందనమన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. సర్దార్ పటేల్ లేకపోతే తెలంగాణకు విముక్తి లభించేది కాదని, సర్దార్ పటేల్, మున్షీ వల్లే నిజాం పాలన అంతమైందని అన్నారు.
తెలంగాణ చరిత్రను కొందరు వక్రీకరించారని, నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాకే ఆ పొరపాటును సరిచేశారని అమిత్ షా అన్నారు. మోడీపాలనలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. కాంగ్రెస్ స్వాతంత్ర్య పోరాటాన్ని కూడా వక్రీకరించిందని విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాజకీయం చేస్తున్నారని, అలాంటి వారిని ప్రజలు క్షమించరని అమిత్ షా అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ విమోచనం కోసం గొంతెత్తిన పార్టీ బీజేపీయేనని అన్నారు. నిజాంకు వ్యతిరేక పోరాట చరిత్రను కాంగ్రెస్ సమాధి చేసిందని, భూమి కోసం.. భుక్తి కోసం ఎందరో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. తెలంగాణ పోరాటయోధుల త్యాగాలను కాంగ్రెస్ గుర్తించలేదని విమర్శించారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపలేదని, కాంగ్రెస్ బాటలోనే ఇప్పుడు బీఆర్ఎస్ నడుస్తోందని ఆరోపించారు. విమోచన దినోత్సవాలు జరపకుండా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.