సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 జులై 2023 (12:57 IST)

ఆరోగ్య శ్రీ లబ్దిదారులకు శుభవార్త.. పరిమితి రూ.5 లక్షలకు పెంపు

harish rao
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ లబ్దిదారులకు ఓ శుభవార్త చెప్పింది. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్టు వెల్లడించింది. అలాగే, కొత్తగా డిజిటల్ కార్డులను అందజేస్తామని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కొత్త డిజిటల్ కార్డులను స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్దిదారులకు పంపిణీ చేస్తామని తెలిపారు. 
 
ఆరోగ్యశ్రీలో బయోమెట్రిక్ విదానం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలందించేందుకు, ఫేస్ రికగ్నేషన్ విధానం అమల్లోకి తేవాలని భావిస్తున్నట్టు చెప్పారు. కొత్త కార్డులను అందించేందుకు లబ్దిదారుల కేవైసీ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయాలన్నారు. నిమ్స్ స్పెషలిస్ట్ వైద్యుల ద్వారా ఆరోగ్య శ్రీ కేసుల మెడికల్ ఆడిట్ నిర్వహించాలన్నారు. 
 
కోవిడ్ సమయంలో రికార్డు స్థాయిలో 856 బ్లాక్ ఫంగస్ సర్జరీలు చేసినట్టు వివరించారు. అదేవిధంగా మూగ, చెవిటి పిల్లలకు చికిత్స అందించి బాగు చేసే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు ప్రస్తుతం కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో ఉచితంగా అందిస్తున్నదని, ఈ తరహా సేవలను ఎంబీఎం వరంగల్‌లోనూ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. 
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేవలం 3 డయాలసిస్‌ కేంద్రాలు మాత్రమే ఉండగా, తెలంగాణ ప్రభుత్వం ఆ సంఖ్యను 103కు పెంచిందని గుర్తుచేశారు. వ్యయప్రయాసలకు ఓర్చి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకండా నియోజకవర్గ పరిధిలోనే డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 
 
దీంతో కిడ్నీ బాధితులకు ఇవి వరంగా మారాయని, మరింత నాణ్యంగా డయాలసిస్‌ సేవలు అందించేందుకు గాను అన్‌లైన్‌ ద్వారా పర్యవేక్షణ చేసే విధంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించి వినియోగించడానికి బోర్డు అనుమతించడం జరిగిందని తెలిపారు. 
 
దీంతో పాటు ఆరోగ్యశ్రీ రోగులకు ఫేస్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగానికి అనుమతి ఇచ్చిందని, బయోమెట్రిక్‌ విధానం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో మరింత పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించేందుకు ఈ విధానం తేవాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.