శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (09:38 IST)

బా.. బ్బాబూ జర తప్పుకోరాదె... ఊపందుకున్న బుజ్జగింపుల పర్వం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి ఘట్టమైన నామినేషన్ల దాఖలు శనివారం సాయత్రంతో ముగిసింది. దీంతో ఇపుడు బుజ్జగింపుల పర్వం ఊపందుకుంది. పోటీ నుంచి తప్పుకోవాలంటూ రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులను ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు వేడుకుంటున్నారు. 
 
వీరి బెడద అధికార పార్టీ తెరాస కంటే కాంగ్రెస్ - టీడీపీ సారథ్యంలో ఏర్పడిన మహాకూటమికే ఎక్కువగా ఉంది. దీంతో ఉపసంహరణ గడువు గురువారం వరకు ఉండటంతో రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకునేలా ప్రధాన పార్టీల నేతలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ పోటీ నుంచి తప్పుకునేందుకు ససేమిరా అంటే.. కనీసం ప్రచారం చేయకుండా ఇంట్లోనే కూర్చోవాలన్న షరతుతో బుజ్జగింపుల పర్వానికి శ్రీకారం చుట్టారు. 
 
తాము గెలిచి అధికారంలోకి వస్తే ఏదో విధంగా ఒక పదవి వచ్చేలా చేస్తామని తెరాస, కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ అభ్యర్థులు రెబెల్స్‌కు హామీ ఇస్తున్నారు. ముఖ్యంగా తెరాస రెబెల్స్‌ బుజ్జగింపులను ఆయా జిల్లాకు చెందిన మంత్రులు, సీనియర్ నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ అప్పగించారు. 
 
అలాగే, కాంగ్రెస్ పార్టీ తరపున పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆధ్వర్యంలోని ఓ కమిటి హైదబాద్‌లో తిష్టవేసి రెబెల్స్ నేతలను పిలిచి మాట్లాడుతోంది. ఇకపోతే, తెలుగుదేశం పార్టీ తరపున ఆ పార్టీ రెబెల్స్‌కు అమరావతి వేదికగా బుజ్జగింపులు పర్వం కొనసాగుతోంది. మొత్తంమీద బుజ్జగింపుల పర్వం గురువారం సాయంత్రం వరకు రసవత్తరంగా సాగనుంది.