గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (09:25 IST)

అవును... మా డాడీకి అప్పిచ్చాం... కేటీఆర్

తన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్ వద్ద అప్పు తీసుకున్నట్టు తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తన నామినేషన్ పత్రాల్లో వెల్లడించారు. దీన్ని కేటీఆర్ ధృవీకరించారు. 'అవును.. మా డాడీకి అప్పిచ్చాం' అంటూ ఆయన తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తాను తన భార్య కలిసి రూ.1.07 కోట్ల మేరకు రుణం ఇచ్చినట్టు తెలిపారు. ఇందులో తాను రూ.82.82 లక్షలను, తన భార్య శైలిమ రూ.24.65 లక్షలను అప్పుగా ఇచ్చినట్టు కేటీఆర్ సమర్పించిన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే, కేటీఆర్ దంపతుల వార్షిక వ్యవసాయ ఆదాయం రూ.84.50 లక్షలుగా ఉంది. 
 
తెలంగాణ ఎన్నికల్లో సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుంచి కేటీఆర్ మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో పేర్కొన్న వివరాల మేరకు కేటీఆర్‌పై మొత్తం 16 కేసులు నమోదైవున్నాయి. ఇందులో ఎక్కువగా తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులే కావడం గమనార్హం. 
 
ఇకపోతే, కేటీఆర్‌కు మొత్తం రూ.3.63 కోట్ల విలువ గల ఆస్తులు ఉన్నాయి. ఆయన భార్య శైలిమ పేరుమీద రూ.27.70 కోట్ల ఆస్తులు ఉన్నాయి. కేటీఆర్ వార్షిక ఆదాయం రూ.59.85 లక్షలు వ్యవసాయం మీద వస్తోంది. అలాగే, ఆయన భార్యకు వ్యవసాయం మీద వచ్చే వార్షిక ఆదాయం రూ.24.65 లక్షలుగా ఉంది. కేటీఆర్ చేతిలో రూ.1.42 లక్షల నగదు, ఆయన భార్య చేతిలో రూ.1.08 లక్షల నగదు ఉన్నట్టు ఎన్నికల నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు.