మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : సోమవారం, 19 నవంబరు 2018 (11:15 IST)

కృష్ణయ్యకు కాంగ్రెస్ టిక్కెట్... సోనియా పర్యటన 3 గంటలే...

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న కేవలం కొన్ని క్షణాల్లోనే ఆయనకు టిక్కెట్ కేటాయించడం గమనార్హం. ఫలితంగా ఆయన మిర్యాలగూడ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. 
 
ఆదివారం హైదరాబాద్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కృష్ణయ్య సమావేశమయ్యారు. అక్కడే ఆయన సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ వెంటనే కాంగ్రెస్ టిక్కెట్ కేటాయించింది. దీంతో ఆయన మిర్యాలగూడ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. 
 
ఈయన గతంలో హైదరాబాద్ ఎల్.బి నగర్ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించారు. అయితే, ఈ స్థానం ప్రస్తుతం సుధీర్ రెడ్డికి కాంగ్రెస్ కేటాయించింది. దీంతో కృష్ణయ్యకు మిర్యాలగూడ స్థానం బరిలోకి దించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ స్థానం నుంచి తెలంగాణ జనసమితి పార్టీ నుంచి అభ్యర్థి బరిలో ఉంటున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ నెలకొంది. 
 
ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రానున్నారు. ఈనెల 23వ తేదీన మేడ్చల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగిస్తారు. అయితే, సోనియా గాంధీ పర్యటన కేవలం మూడంటే మూడు గంటల్లో ముగియనుంది. 
 
ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి 5.30 గంటలకు బయలుదేరి 6 గంటలకు బహిరంగ సభకు చేరుకుంటారు. రాత్రి 7.30 గంటల వరకు సభలో పాల్గొని తిరికి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళిపోతారు.