గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : సోమవారం, 19 నవంబరు 2018 (16:47 IST)

బండ్లగణేష్‌కు పీసీసీ పదవి.. బుజ్జగించేందుకే కాంగ్రెస్.. ఇలా చేసిందా?

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్‌పై గెలిచి తీరాలనే పట్టుదలతో వుంది. కానీ టీఆర్ఎస్ మాత్రం మళ్లీ ప్రభుత్వాన్ని చేజిక్కించుకునేందుకు సై అంటోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన ప్రముఖ నిర్మాత బండ్లగణేష్‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. 
 
ఇందులో భాగంగా పీసీసీకి చెందిన కీలక పదవి కట్టబెట్టింది. అసెంబ్లీ సీటు ఆశించి బండ్ల గణేష్ భంగపడిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియమించింది. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. 
 
తన సొంత నియోజకవర్గమైన షాద్ నగర్ లేదా రాజేంద్ర నగర్ అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం కేటాయిస్తారని బండ్ల గణేష్ ఆశించారు. కానీ మహా కూటమిలోని సీట్ల సర్దుబాటు కారణంతో ఆయనకు సీటు కేటాయించలేకపోయారు. దీంతో గణేశ్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ అధిష్టానం వద్ద అసంతృప్తి వ్యక్తం చేయగా, ఆయన్ని బుజ్జగించే క్రమంలో కాంగ్రెస్ ఈ పదవిని అప్పగించింది.