గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : సోమవారం, 19 నవంబరు 2018 (12:39 IST)

ఊడిగం చేసినోళ్ళకు కట్... ఊడిపడ్డోళ్ళకే టిక్కెట్... జంప్ జిలానీలదే 'హస్త'వాసి

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పలు సిత్రాలు, సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా, దశాబ్దాలుగా పార్టీ నమ్ముకుని, పార్టీ జెండా మోస్తూ ఊడిగం చేసిన వారికి మాత్రం మొండిచేయి చూపించాయి. కానీ, నిన్నామొన్నటివరకు పార్టీ అగ్రనేతలతో పాటు కింది స్థాయి కేడర్‌తో కాలుదువ్విన నేతలు రాత్రికి రాత్రే పార్టీ మారారు. ఇలాంటోళ్ళకు కాంగ్రెస్, తెరాస, టీడీపీ, బీజేపీ హైకమాండ్లు పెద్దపీట వేసి టిక్కెట్లు కేటాయించాయి. 
 
నిజానికి జెండాలు మోసి.. జిందాబాద్‌లు కొట్టి, సీటు దక్కుతుందన్న ఆశగా ఎదురు చూసిన నాయకులు ప్యారాషూటర్ల పుణ్యమాని ఇపుడు లబోదిబోమంటున్నారు. పార్టీని, పార్టీ అగ్రనేతలను నమ్మినందుకు నట్టేట ముంచారంటూ బోరున విలపిస్తున్నారు. ఊడిపడిన వాళ్లకు టిక్కెట్లు కేటాయించి.. ఊడిగం చేసినోళ్ళకు మొండిచేయి చూపారంటూ తలలు బాదుకుంటున్నారు. ఇలా పార్టీలు మారి టిక్కెట్లు దక్కించుకున్న వారి లిస్టులోని ప్రధాన నేతల వివరాలను పరిశీలిస్తే,
 
తెరాసలో దానం నాగేందర్ (ఖైరతాబాద్), బొల్లం మల్లయ్య యాదవ్ (కోదాడ), క్రాంతి కిరణ్ (ఆంథోల్), అబ్రహం (ఆలంపూర్), లింగాల కమల్ రాజ్ (మధిర), తెల్లం వెంకట్రావు (భద్రాచలం)లు ఉండగా, తెలుగుదేశం పార్టీ తరపున సుహాసిని (కూకట్ పల్లి), భవ్య ఆనంద్ ప్రసాద్ (శేరిలింగంపల్లి)లు ఉన్నారు. 
 
అలాగే, కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి (కొడంగల్), నాగం జనార్థన్ రెడ్డి (నాగర్ కర్నూల్), వంటేరు ప్రతాపరెడ్డి (గజ్వేల్), కేఎస్ రత్నం (చేవెళ్ళ), కొండా సురేఖ (పరకాల), సీతక్క (ములుగు), రమేష్ రాథోడ్ (ఖానాపూర్), బానోత్ హరిప్రియా నాయక్ (ఇల్లందు), కందాల ఉపేందర్ రెడ్డి (పాలేరు), భూపతి రెడ్డి (నిజామాబాద్ రూరల్)లకు టిక్కెట్లు కేటాయించారు.
 
ఇకపోతే చివరిగా బీజేపీ నుంచి బాబూ మోహన్ (ఆంథోల్), బొడిగె శోభ (చొప్పదండి), అరుణతార (జుక్కల్), సినీ నటి రేష్మా రాథోడ్ (వైరా), స్వర్ణారెడ్డి డి (నిర్మల్), అమర్ సింగ్ (కార్వాన్), వెంకట్ (కోరుట్ల), హుస్సేన్ నాయక్ (పాలమూరు).