మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : సోమవారం, 19 నవంబరు 2018 (11:45 IST)

తెలంగాణ ఎన్నికలు సిత్రం : భద్రాద్రిలో తోడల్లుళ్ల పగ

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోభాగంగా, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో తోడల్లుళ్లు పోటీపడుతున్నారు. వీరిద్దరి పగ గురించి పూర్వపు ఖమ్మం జిల్లాలోని ఏ ఒక్కరినీ అడిగినా ఇట్టే చెబుతారు. 
 
కొత్తగూడెం స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వర రావు పోటీ చేస్తుంటే ఆయన ప్రత్యర్థిగా బీఎల్ఎఫ్ నుంచి ఎడవల్లి కృష్ణ బరిలో నిలిచారు. వీరిద్దరూ స్వయానా తోడల్లుళ్లు కావడం గమనార్హం. కానీ, వీరిద్దరి మధ్య ఒకరిని ఒకరు ఓడించే పగ, ప్రతీకారాలు దాగివున్నాయి. 
 
గత 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎడవల్లి కృష్ణ పోటీ చేశారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ తరపున వనమా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఈ ఇద్దరిని సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు చిత్తుగా ఓడించారు. 
 
కానీ 2014 ఎన్నికల్లో వనమా వెంకటేశ్వర రావు వైకాపా పార్టీ నుంచి బరిలోకి దిగగా, ఎడవల్లి కృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కూడా వీరిద్దరూ ఓటమిని చవిచూశారు. కానీ, ఈ దఫా మాత్రం ఈ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ వనమాకు పార్టీ హైకమాండ్ టిక్కెట్ కేటాయించింది.
 
దీంతో కృష్ణ బీఎల్ఎఫ్‌లో చేరి పోటీ చేస్తున్నారు. కృష్ణను పోటీ నుంచి విరమింపజేసేలా నచ్చజెబుతామని వనమా కుమారులు తమ చిన్నమ్మ ఇంటికెళ్లగా.. ఆమె శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. దీంతో వనమా కుమారులు ఏం చేయలేక ఇంటికి వచ్చారు. ఫలితంగా కొత్తగూడెం స్థానం నుంచి తోడల్లుళ్లు విజయాన్ని సొంతం చేసుకోవాలన్న ధీమాతో కంటే.. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలన్న పగతో బరిలోకి దిగుతున్నారు.