శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: సోమవారం, 19 నవంబరు 2018 (16:52 IST)

తెలంగాణా పొలిటికల్ కమెడియన్... ఆయనేనంటూ సెటైర్లు...

కాంగ్రెస్ పార్టీ. వందేళ్ల చరిత్ర కలిగింది. ప్రస్తుతం తెలంగాణాలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈసారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదన్న విశ్లేషకుల అంచనా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కావడంతో ఆ పార్టీని ఈసారి ప్రజలు గెలిపిస్తారంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో కొంతమంది నేతలు కాంగ్రెస్ బాట పట్టారు. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన బండ్ల గణేష్‌ ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
 
అంతేకాదు ఏకంగా రాజేంద్రనగర్ సీటును కూడా బండ్ల గణేష్ ఆశిస్తున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది కానీ రాజేంద్రనగర్ సీటు మాత్రం ఎవరికి ఇవ్వాలన్న విషయంపై మల్లగుల్లాలు పడుతోంది. గతంలో రాజేంద్రనగర్ నుంచి టిడిపి తరపున ప్రకాష్‌ గౌడ్ పోటీ చేసి గెలుపొంది టిఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు టిఆర్ఎస్ నుంచే ఆయన పోటీ చేస్తున్నారు. రాజేంద్రనగర్ సీటు తమకు కావాలంటూ టి.టిడిపి కోరుతోంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఆ స్థానాన్ని తమకే ఇవ్వాలని కోరుతోంది. దీంతో ఆ సీటు ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారుతోంది. 
 
మరోవైపు రాజేంద్రనగర్ సీటు కాంగ్రెస్ పార్టీ తరపున తనకేనంటున్నారు బండ్ల గణేష్‌. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి కొన్ని కారణాలున్నాయని చెప్పుకొచ్చారు. అందులో ముఖ్యంగా గణేష్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తున్నాయి. హైదరాబాదులో గుంతలు ఎక్కడ ఉన్నాయని చెబితే వెయ్యి రూపాయలు ఇస్తానని కెటిఆర్ ప్రకటించారు. దీంతో పాటు కేంద్రానికి కెటిఆర్ కొన్ని వార్నింగులు కూడా ఇచ్చారు. ఆ వార్నింగులు చూసిన ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేశారని.. ఇదంతా రాజకీయం గురించి, సమాజం గురించి తెలియనివారు మాట్లాడే మాటలు. కానీ బండ్ల గణేష్‌ లాంటి వ్యక్తి ఈవిధంగా మాట్లాడటం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. బండ్ల గణేష్‌ తెలంగాణా పొలిటికల్ కమెడియన్‌గా చెబుతున్నారు విశ్లేషకులు.