హైదరాబాద్ నగరంలో ప్రేమికులకు చేదువార్త.. ఏంటది?
హైదరాబాద్ నగరంలో ప్రేమికులకు ఇది నిజంగానే చేదువార్తే. ముఖ్యంగా పార్కులకు వెళ్లే ప్రేమికులు ఇకపై పార్కులకు వెళ్లాలంటే వెనుకంజ ఖచ్చితంగా వేస్తారు. ఎందుకంటే, హైదరాబాద్ నగరంలోని పార్కుల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చాలని గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) నిర్ణయించింది.
హైదారాబాద్ నగరంలో అనేక పార్కులు ఉన్నాయి. ముఖ్యంగా, ఇందిరాపార్కులో ప్రేమికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడకు వచ్చే ప్రేమ జంటలు బహిరంగంగానే రొమాన్స్ చేస్తూ ఇతరులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటాయి.
ఇలాంటివారికి చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు పార్కుల్లో సీసీ టీవీ కెమెరాలు అమర్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు 8 వేల కెమెరాల ఏర్పాటు చేసే ప్రతిపాదనకు బుధవారం నాడు జీహెచ్ఎంసీ ఆమోదముద్రవేసింది. దీనికోసం రూ.19.18 కోట్లను ఖర్చు చేయనుంది.
ఈ కాంట్రాక్టు పనులను ఈఈఎస్ఎల్ కంపెనీకి కట్టబెట్టింది. ఈ కంపెనీ నగరంలోని విస్తరిత ప్రాంతాలతో పాటు మురికివాడలు, పార్కుల్లో 8 వేలకు పైచిలుకు కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్ పరిధుల్లో దాదాపు 7.50 లక్షల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఇపుడు కొత్తగా మరో 8 వేల సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.