సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2023 (13:03 IST)

డ్రగ్స్ పేరుతో కొత్త రకం మోసం.. రూ.20 లక్షలు స్వాహా

cyber hackers
హైదరాబాద్ నగరంలో కొత్తరకం సైబర్ క్రైమ్ ఒకటి జరిగింది. నగరానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగికి కస్టమ్స్ ఉద్యోగులమంటూ ఫోన్ చేసి దుండగులు 20 లక్షల రూపాయలు కొట్టేశారు. డ్రగ్స్ పేరుతో భయపెట్టి, డబ్బుల్లేవంటే అప్పటికప్పుడు బ్యాంకు రుణం కోసం దరఖాస్తు పెట్టించి మరీ దోచుకున్నారు. గత నెలాఖరులో జరిగిన ఈ మోసంలో బండ్లగూడకు చెందిన యువతి మోసపోయింది. 
 
సైబర్ క్రైమ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడకు చెందిన యువతికి జులై 26న ఓ ఫోన్ కాల్ వచ్చింది. స్మిత పేరుతో ఓ యువతి పరిచయం చేసుకుని ముంబై నుంచి ఫోన్ చేస్తున్నట్లు తెలిపింది. బాధితురాలి పేరుతో మలేసియాకు పంపిన ఓ పార్సిల్ ముంబైకి తిరిగొచ్చిందని, అందులో డ్రగ్స్ ఉన్నాయని తెలిపింది. దీంతో భయాందోళనలకు లోనైన బాధితురాలు.. ఆ పార్సిల్‌తో తనకేం సంబంధం లేదని చెప్పింది. 
 
అయినా స్మిత వినిపించుకోకుండా కస్టమ్స్ అధికారులతో మాట్లాడాలంటూ మరో వ్యక్తిని వీడియో కాల్‌లోకి తీసుకుంది. ముంబై కస్టమ్స్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాం అంటూ పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అడిగి తీసుకున్నాడని బాధితురాలు చెప్పారు. ఆధార్ వివరాలను పరిశీలించగా తన పేరుతో హవాలా లావాదేవీలు జరిగినట్లు రికార్డైందని భయపెట్టాడని వివరించారు. 
 
ఇంతలో సీబీఐ అధికారిని అంటూ మరో వ్యక్తి లైన్‌లోకి వచ్చాడని, తన కుటుంబం మొత్తం చిక్కుల్లో పడిందని భయపెట్టాడని బాధితురాలు తెలిపారు. రూ.20 లక్షలు ఇస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తానని చెప్పాడన్నారు. అంత డబ్బు లేదని చెప్పగా.. తనతో అప్పటికప్పుడు బ్యాంకు లోనుకు ధరఖాస్తు పెట్టించారని, లోన్ సాంక్షన్ అయి రూ.19.94 లక్షలు తన ఖాతాలో జమ కాగానే, వాటిని బదిలీ చేయించుకున్నారని వివరించింది. 
 
డబ్బు ముట్టాక కొంతమంది అధికారులను ఇంటికి పంపించి పార్సిల్‌లో వచ్చిన డ్రగ్స్‌తో తనకు ఎలాంటి సంబంధంలేదని డాక్యుమెంట్లపై సంతకం తీసుకుంటామని చెప్పారని బాధితురాలు వివరించారు. అయితే, రాత్రి కావొస్తున్నా అధికారులు ఎవరూ తన ఇంటికి రాకపోవడంతో వారికి ఫోన్ చేసేందుకు ప్రయత్నిస్తే స్విచ్ఛాఫ్ వచ్చిందని తెలిపారు. దీంతో మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ అధికారులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.