ఈ కాంగ్రెస్ పార్టీకి ఏమైంది? ఏపీలో మటాష్... తెలంగాణలోనూ ఎమ్మెల్యేలు జంప్...
ఏ ముహూర్తాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించిందో కానీ అప్పటి నుంచి ఆ పార్టీకి లేవలేని దెబ్బలు తగులుతూనే వున్నాయి. ఏపీ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. అలాంటి కోటను కొల్లగొట్టి ముందూ వెనుక ఆలోచించకుండా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఏపీ రాష్ట్రాన్ని విడగొట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూతద్దం పెట్టి వెతకాలని చూసినా కనిపించకుండా పోయింది.
ఇక ఇప్పుడు తెలంగాణ వంతు వచ్చినట్లుంది. అక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది నేరుగా సీఎల్పీని తెరాసలో విలీనం చేయాలంటూ సీఎం కేసీఆర్ ఇంటి ముందు నిలబడ్డారు. గతంలో తెదేపా పరిస్థితి కూడా ఇలాగే మారిపోయింది. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ వంతు వచ్చింది. ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో మూడింట రెండు వంతుల మంది ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తే దానికి బలం వున్నట్లే.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచినందున ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీనితో కాంగ్రెస్ పార్టీ బలం 18కి పడింది. ఆ ప్రకారం కావల్సినంత బలం వుంది కనుక ఆ 12 మంది ఎమ్మెల్యేలు కారెక్కేస్తున్నట్లు ప్రకటించేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని స్పీకర్ కి అందజేశారు. స్పీకర్ ఆమోదిస్తే... ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడిపోయినట్లే.
ఇంత జరుగుతున్నా కేంద్ర అధినాయకత్వం పట్టించుకున్నట్లు కనబడటం లేదు. చూస్తుంటే... కేంద్రంలో అధికారం రాలేదన్న నైరాశ్యంలో వాళ్లు వున్నారేమోననిపిస్తోంది.