శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (10:30 IST)

నేడు బీజేపీ శ్రేణుల బంద్ : బండి సంజయ్‌కు గుండు పగులుద్ది

మేడ్చల్ మల్కాజిగిరిలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో తెరాస, బీజేపీ కార్యకర్తల మధ్య మాటామాటా పెరగటంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌పై తెరాస కార్యకర్తలు దాడిచేయటంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన కార్పొరేటర్ శ్రావణ్‌ను ఆస్పత్రికి తరలించారు. 
 
కార్పొరేటర్‌పై దాడిని నిరసిస్తూ బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ దాడికి సంబంధించి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు మరో 15 మంది కార్యకర్తలపై మల్కాజిగిరి పోలీసులు కేసులను నమోదు చేశారు.
 
కాగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై టిఆర్‌ఎస్ కార్యకర్తలు దాడికి నిరసనగా సోమవవారం నాడు బిజెపి బంద్‌కు పిలుపునిచ్చింది. దీనిపై తెరాస ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఘాటుగా స్పందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మల్కాజ్‌గిరిలో అడుగు పెడితే గుండు పగులుద్ధి అంటూ హెచ్చరించారు. 
 
అదేవిధంగా, బండి సంజయ్‌కు దమ్ముంటే తన ముందు ఆరోపణలు చేయాలని సవాల్ విసిరారు. కాగా, బండి సంజయ్ స్థాయి కార్పొరేటర్‌కి ఎక్కువ.. ఎంపీకి తక్కువ అని విమర్శించారు. ఇప్పటి నుంచి బండి సంజయ్ భరతం పడతానన్నారు. అదేవిధంగా సంజయ్ రాసలీలలను త్వరలోనే మీడియా ముందు హెడతామని హెచ్చరించారు.