బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (10:20 IST)

నేడు దళిత బంధుకు శ్రీకారం : సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఇదే

తెలంగాణ సర్కారు దళిత బంధు పథకానికి సోమవారం నుంచి శ్రీకారం చుట్టనుంది. పైలట్ ప్రాజెక్టుగా తొలుత హుజురాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రారంభిచనుంది. ఇందుకోసం హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో భారీగా ఏర్పాట్లు చేశారు. 
 
ఇందుకోసం సీఎం కేసీఆర్ సోమవారం శాలపల్లికి చేరుకోనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ కూడా ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్‌ ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి హుజూరాబాద్‌ బయలుదేరి వెళ్తారు.
 
మధ్యాహ్నం ఒంటిగంట 40 నిమిషాలకు శాలపల్లికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు శాలపల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. 
 
సీఎం రాకతో హుజూరాబాద్‌ గులాబీ వర్ణ శోభితమైంది. గ్రామ గ్రామ సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. శాలపల్లికి వెళ్లే మార్గాన్ని మొత్తం సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీలు, కటౌట్లతో నిండిపోయాయి. దీంతో హుజూరాబాద్‌ మొత్తం గులాబీమయమైంది.
 
దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా హుజూరాబాద్‌లో ప్రారంభించాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. శాలపల్లి ఇందిరానగర్‌లో నిర్వహించనున్న సభలో లబ్ధిదారులకు 10 లక్షల రూపాయల చొప్పున చెక్కులు ఇవ్వబోతున్నారు. 2018 మే 10న ఇదే వేదికపై రైతుబంధును ప్రారంభించిన విషయం తెల్సిందే.