1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

పులి వస్తోంది.. జింక పారిపోతోంది... బండి సంజయ్

bandi sanjay
తెలంగాణ రాష్ట్రంతో పాటు.. తెలంగాణ సమాజం మార్పు కోసం భారతీయ జనతా పార్టీ పని చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అందువల్ల తమ పార్టీకి ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. 
 
జులై 3న సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో భాజపా నిర్వహించే భారీ బహిరంగ సభ ఏర్పాటు పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాజపా కట్టడికి సీఎంవోలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారన్నారు. సీఎం కేసీఆర్‌ను ప్రజలే పట్టించుకోవట్లేదని.. భాజపా కూడా పట్టించుకోదని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ నగరానికి వస్తున్నారంటేనే సీఎం కేసీఆర్ నగరం విడిచిపోతున్నారన్నారు. ఒక రకంగా చెప్పాలంటే పులి వస్తే జింక పారిపోయినట్లు కేసీఆర్‌ పారిపోతున్నారని విమర్శించారు. 
 
'జులై 3న సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటుచేస్తున్నాం. సభను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తున్నాం. తెలంగాణలో పార్టీ పాలసీలను ప్రకటించడానికి, ప్రజల్లో చైతన్యం చేయడానికి సభ ఏర్పాటు చేస్తున్నాం. 10 లక్షల మందిని సభకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ మేరకు బూత్‌ నుంచి రాష్ట్రస్థాయి నేతల వరకు సమావేశాలు నిర్వహించాం. జన సమీకరణ కోసం కమిటీలు వేశాం. భాజపా కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలిరావాలి' అని కోరారు.