ప్రశ్నిస్తే దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారు : మంత్రి కేటీఆర్ ధ్వజం
సీబీఐ, ఐటీ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బీజేపీ పాలకులు ఉసిగొల్పుతున్నారని రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. హన్మకొండ జిల్లా వేలేరు మండలం షోడశాపల్లిలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని బీజేపీ పాలకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కేంద్రంలోని బీజేపీ పాలకులు చేసే అరాచకాలను ప్రశ్నిస్తే దర్యూప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్థలను వేట కుక్కల్లా ఉసిగొల్పి కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం వంటి దిక్కుమాలిన పనులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించేందుకు మరో కారణం లేకపోవడంతో కుటుంబ పాలన ఆయన కొత్త పల్లవిని ఎత్తుకున్నారని అన్నారు.
అయితే, తమది ముమ్మాటికి కుటుంబ పాలనే అని, 60 లక్షల మంది రైతులున్న కుటుంబానికి రూ.60 వేల కోట్లు ఇచ్చామన్నారు. ఆడబిడ్డల పెళ్లికి రూ.లక్ష ఇస్తున్న మేనమామ… సీఎం కేసీఆర్ అని చెప్పారు. దేశంలో అత్యుత్తమ 20 గ్రామపంచాయతీల్లో 19 తెలంగాణ నుంచే ఎంపికయ్యాయని కూడా తెలిపారు.
కరోనా వ్యాక్సిన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే కనిపెట్టారని తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయనకు మెదడు మోకాళ్లలో ఉందని విమర్శించారు. ఇకపోతే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నాడని, ఈయన ఎంపీ అయింది ఇందుకేనా? అని నిలదీశారు. మోడీ ఎవనికి దేవుడో, ఎందుకు దేవుడో చెప్పాలని ప్రశ్నించారు.
వేధింపులకు గురై మృతి చెందిన ప్రీతి విషయంలో కొందరు కావాలని రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నిందితుడు సైఫ్ అయినా.. సంజయ్ అయిన వదిలిపెట్టేది లేదని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.