ఐఏఎంసీ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎన్వీ రమణ
హైదరాబాద్ నగరంలో నిర్మించతలపెట్టిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ (ఐఏఎంసీ) నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం భూమిపూజ చేశారు. ఇది భారతదేశంలో నిర్మించే తొలి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం. ఈ నిర్మాణానికి హైదరాబాద్ వేదిక కావడం గొప్ప విశేషం అని ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. గచ్చిబౌలిలో ఐఏఎంసీ కేంద్రాన్ని నిర్మించనున్నారు.
ఈ భూమిపూజ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సుప్రీంకోర్టు జడ్జీలు హిమా కోహ్లీ, నాగేశ్వర రావు, తెలంగాణ హైకోర్టు సీజే సతీష్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ, ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ భవన నిర్మాణానికి సహకరించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుకుంటున్నట్టు చెప్పారు. ఎంతో విలువైన భూమిని గచ్చిబౌలిలో కేటాయించడమే కాకుండా రూ.50 కోట్లను నిర్మాణానికి కేటాయించడం ముందగుడు అని అన్నారు.
ఈ కేంద్రం వల్ల భాగ్యనగరికి మరింత పేరు వస్తుందని, సింగపూర్ తరహాలో హైదరాబాద్ కేంద్రం కూడా ప్రపంచ ఖ్యాతి పొందాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ.రమణ ఆకాంక్షించారు. కాగా, ఈ భవన నిర్మాణం వచ్చే యేడాది పూర్తి చేయనున్నారు.