1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 జులై 2022 (15:29 IST)

సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే - ముంపు బాధితులకు రూ.10 వేలు

cm kcr
భారీ వర్షాల వల్ల సంభవించిన వరదలతో తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ వరద ముంపు అధికంగా ఉంది. ఈ క్రమంలో ఈ వరద బాధిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఆదివారం ఏరియల్ సర్వే చేశారు. 
 
భద్రాచలం నుంచి ఏటూరునాగారం దిశగా హెలికాప్టర్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను వీక్షించారు. ప్రకృతి విపత్తుతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి, ఇరువైపులా జలమయమైన ప్రాంతాలు, నీటిలో చిక్కుకున్న గ్రామాల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదికి సీఎం శాంతి పూజలు చేశారు. భద్రాచలం వంతెనపై నుంచి గోదావరి పరిసరాలను పరిశీలించారు. గోదావరి కరకట్టను కూడా సీఎం వీక్షించారు.
 
ఈ సందర్బంగా భద్రాచలంలో వరద ముంపు బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందచేస్తామని ప్రకటించారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చర్యలు చేపడుతామన్నారు. అదే విధంగా ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలకు ఎత్తైన ప్రదేశంలో రూ.వెయ్యి కోట్లతో కొత్త కాలనీని నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 
 
ఇప్పటివరక మొత్తం 7274 కుటుంబాలను జిల్లా యంత్రాంగం పునరావస కేంద్రాలకు తరలించిందన్నారు. బాధిత కుటుంబాలకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని, ప్రతి కుటుంబానికి 20 కేజీల చొప్పున బియ్యం ఇస్తామన్నారు.