కరోనా పేరుతో దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు - బిల్లు చెల్లించలేదనీ...

sultana
ఠాగూర్| Last Updated: ఆదివారం, 5 జులై 2020 (14:23 IST)
కరోనాకు వైద్యం పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు రోగులను దోచుకుంటున్నాయి. కరోనా వైరస్ రోగులు పొరపాటున చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లినపక్షంలో వారిని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఈ తరహా సంఘటనలు ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో వెలుగు చూశాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో కూడా ఓ సంఘటన ఒకటి వెలుగు చూసింది. కరోనా చికిత్స చేసిన తర్వాత బిల్లు చెల్లించలేదన్న కోపంతో ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది ఓ మహిళా వైద్యురాలిని గదిలో నిర్బంధించారు. ఈ దారుణాన్ని ఆమె ఓ సెల్ఫీ వీడియో ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేసింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని ఫీవర్ ఆస్పత్రిలో సుల్తానా అనే ఓ మహిళ డీఎంవోగా పని చేస్తూ వస్తోంది. ఈమెలో కరోనా లక్షణాలు కనిపించడంతో చాదర్‌ఘాట్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి, చికిత్స తీసుకుంది. అయితే, ఆస్పత్రి సిబ్బంది కేవలం 24 గంటలకు 1.15 లక్షల రూపాయల బిల్లు వేసి, అది కట్టాలని ఒత్తిడి తెచ్చారు. అంత బిల్లు ఎందుకు చెల్లించాలంటూ ఆ మహిళ నిలదీయడంతో ఆమెను ఓ గదిలో ఆస్పత్రి సిబ్బంది నిర్బంధించారు.

తనను హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నిర్బంధించారంటూ హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆసుపత్రి డీఎంవో సుల్తానా ఓ సెల్ఫీ వీడియో ద్వారా తెలిపారు. కొవిడ్‌-19 లక్షణాలతో తాను ఈ ఆసుపత్రిలో చేరానని, అయితే, 24 గంటలకు రూ.1.15 లక్షల బిల్లు వేశారని సెల్ఫీ వీడియోలో ఆమె కన్నీరు కార్చుతూ తెలిపారు. అంత బిల్లు ఎందుకని అడిగినందుకు ఆ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది ఈ దారుణానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.దీనిపై మరింత చదవండి :