ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: బుధవారం, 29 జులై 2020 (18:26 IST)

మాస్కు వేసుకోమన్నందుకు కత్తితో పొడిచేశాడు

కరోనా వైరస్‌కు ఇంకా వ్యాక్సిన్ రాకపోవడంతో దానిని కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలని ప్రభుత్వాలు ఎప్పటికప్పడు ప్రజలకు సూచిస్తున్నాయి. బయటకు వెళ్లినప్పడు శానిటైజర్లు రాసుకోవడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి సూచనలను ప్రభుత్వాలు పదేపదేమనకు తెలుపుతున్నాయి.
 
కానీ ప్రజలు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. మరికొంత మంది ఇతరులు సలహా ఇస్తే వారితో తిరుగుబాటుకు దిగుతున్నారు. కరీంనగర్‌లో ఓ యువకుడికి మరో వ్యక్తి మాస్కు ధరించుకోమని చెప్పినందుకు ఆ యువకుడు వ్యక్తిపై దాడికి దిగాడు. ఈ సంఘటన జిల్లాలోని తీగలగుట్ట పల్లిలో బుధవారం చోటుచేసుకున్నది.
 
కరీంనగర్‌కు చెందిన అజీజ్ అనే వ్యక్తి క్షవరం చేసుకోవడం కోసం సెలూన్ షాపు వద్దకు వచ్చాడు. అతడు మాస్క్ ధరించక పోవడంతో అదే గ్రామానికి చెందిన రాకేష్ మాస్క్ ధరించుకోమన్నాడు. ఈ విషయమై వీరిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. అంతటితో ఆగకుండా అజీజ్ కత్తితో రాకేశ్ పైన దాడికి దిగి కత్తితో పొడిచాడు. దాంతో రాకేష్ అక్కడిక్కడే కుప్పకూలి పోయాడు. ప్రక్కనున్న స్థానికులు రాకేష్‌ను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.